యూట్యూబ్ వీడియోలు చూసేవారికి ‘నా అన్వేషణ’ ఛానల్ గురించి తెలిస్తే. ఓ యువకుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పర్యటిస్తూ, తనకు తోచినట్టుగా మాట్లాడుతూ, కొన్నిసార్లు ఘాటైన పదాలు ఉపయోగిస్తూ వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. ‘నా అన్వేషణ’ యూట్యూబ్ ఛానెల్‌కు 18 లక్షల మంది సబ్ స్క్రైబర్‌లు ఉన్నారు. అయితే, ఈ యూట్యూబ్ చానల్లో ఇటీవలి రాజకీయపరమైన అంశాలతో కూడిన వీడియో ఒకటి దర్శనమిచ్చింది. అందులో జింబాబ్వే దేశంలోని అధిక ద్రవ్యోల్బణం పరిస్థితులను, ఏపీ పరిస్థితులను పోల్చడం కనిపిస్తుంది. అయితే, ‘నా అన్వేషణ’ ఛానెల్‌కు నారా లోకేశ్ రూ.5 కోట్లు ఇచ్చాడంటూ ఓ పత్రికలో వార్త వచ్చింది. నారా లోకేశ్ డబ్బిచ్చి అతడితో ఆ విధంగా చెప్పించాడన్నది ఆ పత్రిక కథనం.

దీనిపై నారా లోకేశ్ స్పందించారు. “వైసీపీ ఎప్పుడో దిగజారిపోయింది. ఇంతకంటే దిగజారడానికి ఏమీ లేదు. జగన్ విధ్వంసక పాలనను ప్రశ్నించిన వారిని అప్రదిష్ట పాల్జేసేలా వైసీపీ 5 రూపాయల పేటీఎం బ్యాచ్ చర్యలు కొనసాగుతున్నాయి. మన రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర భవిష్యత్తుపై బాధ్యతాయుతంగా స్పందించి, అభిప్రాయాలను వెల్లడించిన ‘నా అన్వేషణ’ను తప్పకుండా మెచ్చుకోవాలి” అని పేర్కొన్నారు.