
- భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు
ముద్ర ప్రతినిధి భువనగిరి :నేనున్నాను.. మీ పిల్లలందరిని చదివిస్తా… భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం యాదాద్రి భువనగిరి ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రి.. మార్గమధ్యలో కార్యకర్తల అభ్యర్ధన మేరకు భువనగిరి పట్టణ బైపాస్ రోడ్డులో వివేరా హోటల్ దగ్గర ఆగారు. కార్యకర్తలతో మాట్లాడి బయటకు వస్తున్న ఆయన ముగ్గురు పిల్లలతో దీనంగా ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు మండలం, ఆరేగూడెం గ్రామానికి చెందిన మమత అనే మహిళను చూసి ఏ ఊరమ్మా అంటూ అడిగారు.
మంత్రి పలకరింపుతో దుఃఖాన్ని దిగమింగుకుంటూ.. తన భర్త హర్ట్ స్ట్రోక్ తో చనిపోయాడని, ముగ్గురు పిల్లల్ని చదవడం, కుటుంబాన్ని పోషించడం ఇబ్బందిగా మారిందంటూ తన దీనగాథను మొత్తం మంత్రికి వివరించింది. చలించిపోయిన మంత్రి పిల్లలను ఎంత చదివితే అంతవరకు తానే చదివిస్తానని.. ప్రస్తుతం కుటుంబ పోషణ కోసం ఆర్థిక భరోసా కల్పించారు.మంత్రి సాయంతో భావోద్వేగానికి గురైన మమత ఆ దేవుడు మిమ్మిల్ని చల్లగా చూడాలంటూ చేతులెత్తి వేడుకుంది. ప్రభుత్వ సాయం కోసం అడుగుదామని వస్తే ఏదో.. మా జీవితాలను మార్చివేశాడని సంతోషం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్, కాంగ్రెస్ జిల్లా నాయకులు గుర్రం లక్ష్మీనరసింహ రెడ్డి, పైళ్ల సోమిరెడ్డి, మోత్కూరు పట్టణ అధ్యక్షులు గుండగోని రామచంద్రుగౌడ్, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, మెంట నగేష్, గొలుసుల శ్రీను ఉన్నారు.