విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ లూనా సెంటర్‌లోని ఓ మదర్సాలో శుక్రవారం ఉదయం బాలిక కరిష్మా (17) అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. బాలిక తల్లిదండ్రులు, పోలీసులు, వైద్యాధికారుల వివరాల మేరకు.. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం అంగలూరుకు చెందిన కరిష్మా ఏడో తరగతి పూర్తి చేసింది. మూడేళ్ల అరబిక్ కోర్సు చదివేందుకు ఏడాది కిందట మదర్సాలో చేరింది. బాలికకు అనారోగ్యంగా ఉందంటూ మదర్సా నిర్వాహకులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారు వచ్చేలోగానే విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకొచ్చేసరికే బాలిక చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు కుటుంబసభ్యులకు, పోలీసులకు తెలియజేశారు. కరిష్మా మృతిపై అనుమానాలున్నాయని, తమకు న్యాయం చేసే వరకూ మృతదేహాన్ని తీసుకెళ్లేది లేదని మదర్సా వద్దకు వచ్చి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. మదర్సా నిర్వాహకుల వల్లే మృతి చెందిందంటూ కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న ఈ మదర్సాలో 63 మంది బాలికలు చదువుకుంటున్నారు.
మదర్సాలో బాలిక అనుమానాస్పద మృతి
11