ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన సి రామచంద్రయ్య, మహమ్మద్ ఇక్బాల్ తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా.. అందుకు అనుగుణంగానే కూటమి పార్టీల అభ్యర్థులను ఖరారు చేశాయి. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఈ ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కూటమి పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి. అసెంబ్లీలో పార్టీలకు ఉన్న సీట్ల నేపథ్యంలో ఈ రెండు స్థానాలు కూటమికి దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి ఒక అభ్యర్థిని, జనసేన నుంచి మరో అభ్యర్థిని ఆయా పార్టీలు ఖరారు చేశాయి. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి టిడిపిలో చేరిన సి రామచంద్రయ్యకు తెలుగుదేశం పార్టీకి మరోసారి అవకాశం కల్పించగా, మరో సీటును జనసేనకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేటాయించారు. జనసేనకు కేటాయించిన ఎమ్మెల్సీ స్థానం నుంచి హరి ప్రసాద్ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.
ఏపీలో ఖాళీ అయిన ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గత నెలలోనే షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 25న ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయగా, జూలై 2వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జులై మూడో అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించనున్నారు. అభ్యర్థులు జూలై 5 వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. జూలై 12న ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించి అదే రోజు పరీక్షలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం కూటమికి ఉన్న బలం నేపథ్యంలో ఈ రెండు స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. శాసనసభలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేనకు 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసిపి అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం లేదు. కాబట్టి ఈ రెండు స్థానాలు ఏకగ్రీవంగానే కూటమి పార్టీలు గెలుచుకుంటున్నాయి. ఎన్నికలకు కొద్ది రోజులు ముందు టిడిపిలో చేరిన సమయంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సి రామచంద్రయ్యకు మరోసారి అదే పదవి దక్కుతుండగా, మహమ్మద్ ఇక్బాల్ కు మాత్రం ఈ పదవి దక్కలేదు. భవిష్యత్తులో మంచి అవకాశాలు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీకి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఈ ఇద్దరు వైసీపీ నేతలపై శాసనమండలి చైర్మన్ మోషన్ రాజుకు ఫిర్యాదు చేయగా వీరిపై అనర్హత వేటు వేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. తాజాగా టిడిపి నుంచి శ్రీ రామ చంద్రయ్య జనసేన నుంచి హరిప్రసాద్ ఎంపికయ్యారు. వీరిద్దరూ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు.