48
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలోని రేషన్ దుకాణం-5లో బియ్యం నిల్వల్లో తేడా రావడంతో శుక్రవారం రెవెన్యూ అధికారులు రేషన్ దుకాణంలో తనిఖీలు చేసి, సీజ్ చేశారు. వీరికి విస్తుపోయే నిజాలు తెలిశాయి. తహసీల్దార్ ఎ.వనజ ఆదేశాల మేరకు ఆర్ఐ ఖాజామోహీనుద్దీన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. అక్కడ 58 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉండాల్సి ఉండగా, కేవలం 25 క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 33 క్వింటాళ్ల బియ్యం స్థానంలో బస్తాల్లో వరిపొట్టును నింపి ఉంచటం తనిఖీల్లో గుర్తించారు. వెంటనే రేషన్ డీలర్ వేద మహేశ్వరిపై 6ఏ కేసు నమోదు చేసి, దుకాణాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు.