ఆయన పేరు వినగానే స్ఫురణకు వచ్చే ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’వాక్యం జన్మభూమి కీర్తిని ఎలుగెత్తిన స్వరం. ఆయన పోరుబాట నడిచిన కవి. “నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజా వాటి”అని చాటి ప్రజలతో మమేకమైన అభ్యుదయభావ శరధి. ఆయనే దాశరథి కృష్ణమాచార్యులు. ప్రజల గుండెల “రుద్రవీణ”ను మీటి బాధలపై తిరగబడి “అగ్నిధార”ల కురిపించిన ధీశాలి.
గడీలనెదిరించి బేడీలను స్వాగతించిన కవిత సైనికుడను, పోరాటయోధుడను అన్న చాటి చెప్పిన మనిషి. “ఆ చల్లని సముద్రగర్భం” ప్రతీకగా రగిలించిన బడబానలను ఆర్పమనే సందేశమిచ్చిన” సమాజ కవి. అభ్యుదయ “కవితామృతాభిషేకం”తో ప్రజలను మేల్కొలిపి సమాజాన్ని కమ్మేసిన” తిమిరంతో సమరం”చేసి సమాజ జీవిత క్షేత్రంలో వెలుగులపంట పండించిన హలధారి.
నిజాం నిరంకుశ పాలనపై అక్షర శరాలు సంధించి ధిక్కార స్వరం వినిపించిన ఉద్యమ వైతాళికుడు. అభ్యుదయ కవిగా ఆవిర్భవించి భావకవితా గీతాలకు పట్టం కట్టిన కవి తనయుడు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించారు. దాశరథి కృష్ణమాచార్యులు 1925 జూలై 22న వెంకటమ్మ రంగాచార్యుల దంపతులకు నాటి వరంగల్ జిల్లా చిన్న గూడూరులో (ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా) జన్మించిన బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బి.ఎ అధ్యయనం చేసారు..
సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించారు. 1949లో సాహితీ మేఖల సంస్థ తరపున దేవులపల్లి రామానుజరావు, పులిజాల హనుమంతరావు ఆధ్వర్యంలో అచ్చయిన దాశరథి మొట్టమొదటి పుస్తకం ‘అగ్నిధార”. దాశరథిని సాహిత్య జీవితంలో తొలి నుంచీ ప్రోత్సహించినవారు దేవులపల్లి రామానుజరావు. ఆంధ్ర సారస్వత పరిషత్ కు ఆహ్వానించి కవి సమ్మేళనాలలో భాగస్వామిని చేసారు. ఆయన మంచి ఉపన్యాసకుడు. భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించిన ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో ఒకరు.
ఉపాధ్యాయునిగా, పంచాయితీ అధికారిగా, ఆకాశవాణి ప్రయోక్తగా బాధ్యతలు నిర్వహించి పలురంగాలలో పేరొందిన తెలుగువాడు. దాశరథి సాహితీ కృషి కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు.. ఇలా అనేక ప్రక్రియల్లో సాగింది. ప్రారంభంలో కమ్యూస్టు పార్టీ పట్ల అభిమానం పెంచుకుని, ద్వితీయ ప్రపంచ సంగ్రామ సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక పార్టీ బయటకు వచ్చి హైదరాబాదు సంస్థలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొన్న యువకుడు.
‘సంపాదిస్తూ విద్యను అభ్యసించే’సూత్రాన్ని పాఠశాల దశలోనే పటించటానికి తోటి విద్యార్థుల వ్యాకరణం, ఉర్దూ భాషలలో పాఠాలు బోధించి, వచ్చిన ప్రతిఫలంతో జీవిత ఆర్థిక అవసరాలతో పాటు పుస్తకాలు కొని సాహిత్య అధ్యయనం చేసారు. ‘జీవితంలో ప్రతి క్షణం అమూల్యం’అనే భావించేవారు. యువకునిగానే ‘మహాకవి’ అనిపించుకున్నా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలంటే తత్వానికి నిలువెత్తు నిదర్శనం ఆయన. తనను ఆదరించిన వారిని, తన మూలాలను ఆయన మరవిపోలేదు. వర్థమాన కవుల రచనలను మెచ్చి ప్రోత్సహించడంలో పలువురి రచనలకు ‘ముందుమాట’రాసారు. రచయితను, రచనను ఆస్వాదించడం, ఆస్వాదించిన నాలుగు వాక్యాల్లో వ్రాసి పంపిటర్ వారెంత సంతోషిస్తారు, అనే వారు.
ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వంలో జైలు శిక్ష అనుభవించారు. నిజామాబాద్ ఇందూరు కోటలో ఆయన్ని మరో 150 మందితో ఖైదు చేసినప్పుడు ఆయనతోపాటు వట్టికోట ఆళ్వారు కూడా ఉన్నారు. పళ్ళు తోముకోవడానికి బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నవ్యక్తి దాశరథి. నిజాం పాలనలో పలు విధాల హింసలనుభవిస్తున్న తెలంగాణా ప్రజాను చూసి చలించి, పీడిత ప్రజల గొంతుగా మారి నినదించిన కవి కిశోరం.
మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను గాలిబ్ గీతాలు పేర తెలుగులోకి అనువదించిన భాషా ప్రావీణ్యం ఆయనది. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడిగా జిల్లాల్లో సాహితీ చైతన్య విత్తనం నాటారు. కవిత్వంలో అంగారాన్ని, శృంగారాన్ని సమంగా పండించి ఆయనలో అగ్నివీణతో పాటు శృంగార కవిత ప్రియత్వం ఉందని నిరూపించుకున్నారు. పాతికేళ్ల వయసుకే ‘మహాకవి’గా ప్రశంసలు అందుకున్నారు.
‘చెంపపై నిశ్శబ్దంగా జారే కన్నీటి చుక్కను తుడవడానికి మరో హృదయం పడే తపనే ప్రేమ. అదే చుక్కను రానివ్వకుండా ఆరాటపడే హృదయమే స్నేహం’అనేది ఆయన తత్వం. “అందరికీ ఆయన మిత్రులే. ఆయనకు అందరూ మిత్రులే. వారిలో కొందరు ఆప్తులు. అన్నయ్య కల్ల కపటం ఎరుగనివాడు. స్నేహం అంటే ప్రాణం ఇచ్చేవాడు. ఆయనకి వేల సంఖ్యలో మిత్రులున్నారు. ఆయనకు హెచ్చు తగ్గులు లేవు. ప్రధానమంత్రితోనూ, పసిపాపతోనూ ఒకేలా మాట్లాడేవాడు. ఎవరు ఉత్తరం రాసినా వెంటనే జవాబు రాసేవాడు. అసలు ఆయనకు మిత్రులు కానీ వారెవరు? ఒక్క నిజాం ప్రభువు తప్ప’అన్నారు, ఆయన సోదరులు దాశరథి రంగాచార్యులు. ‘
‘స్నేహం కోసం, తను అభిమానించే వ్యక్తి కోసం ప్రాణాలు ఇచ్చే మనిషి దాశరథి. అలాంటి వ్యక్తులు సాధారణంగా తారసపడతారు. సాహిత్యం ఎంత సరళమో మనిషి అంత ఆవేశపూరితం., మనసు అంత మృదులం. బొత్తిగా లౌక్యం తెలియని మనిషి. జీవితంలో వెనక్కి తిరిగి చూడడం అలవాటులేని కారణంగా చాలా నష్టపోయిన మనిషి’అని ‘అని రచయిత, నటుడు దివంగత గొల్లపూడి మారుతీరావు ‘ ఒక సారి జరిగింది. ‘స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో అరుదైన కవి దాశరథి’అన్నారు ప్రఖ్యాత గీత రచయిత వేటూరి సుందరరామమూర్తి. జన్మభూమి అన్నా, దానిపై రచనలన్నా ఆయనకు తగని మక్కువ. అందుకే దేవులపల్లి రామానుజరావు. దాశరథియే తెలంగాణము, తెలంగాణమే దాశరథి’అని ‘అగ్నిధార కావ్యం ముందుమాటలో ప్రశంసించారు. ‘అయన ఉద్రేకి. అన్యాయాన్ని సహించాడు. దిగజారే మనిషి కాదు’అని హీరాలాల్ మోరియా ఒక సందర్భంలో.
అగ్నిధార, మహాంధ్రోదయం, రుద్రవీణ సహా మొత్తం 21 కవితా సంకలనాలు; 1967 లో ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, 1974 లో కేంద్ర సాహిత్య అకాడమి బహుమతులు, కవిసింహం, అభ్యుదయ కవిసామ్రాట్, యువకవి చక్రవర్తి, ఆంధ్రకవితాసారధి’ ఆంధ్రా కవితా సారధి.. బిరుదులు, 1977 నుంచి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి; ఆంధ్రవిశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’, ఆంధ్ర, ఆగ్రా, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయాల గౌరవ డాక్టరేట్లు’ ఆయన కీర్తి కిరీటంలో మరకత మాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు. 1961లో ఇద్దరు సినీ మిత్రులు సినిమాలో పాటలు రాయడంతో ఆయన సినీరంగ ప్రవేశం చేసి, ఇంచుమించు కొన్ని వందల పాటలతో తెలుగు సాహిత్య సేవ . 62వ యేట 1987 నవంబర్ 5న కోటి రతనాల వీణ తంత్రులు తెగిపోయాయి..
దాశరథి వ్యక్తిత్వాన్ని వేటూరి మాటల్లోనే చెప్పాలంటే, ‘అతను బుడుగైనా ఆర్తి పొడుగు. మూర్తి చిన్నదైనా కీర్తి దొడ్డది. అతను నాటు తెలుగు గూటిలో గుట్టుగా దాగి ఒక్కపెట్టున గుక్కపట్టి గొంతువిప్పిన కవితల గిజిగాడు…రాక్షసత్వపు రాజాకారులకు మానవత్వపు ప్రజాకారుడై తిరగబడ్డ తెలుగుబిడ్డ. కవిగా పుట్టి కవిగా ఎదిగి కవిగా కన్నుమూసిన తెలుగుజాతి వైతాళికుడు.
(జులై 22 శత జయంతి సందర్భంగా)
నందిరాజు రాధాకృష్ణ., 98481 28215